మేరీ కామ్ ఏడ్చేశారు..!
‘‘ఒక పాత్ర కోసం ఎలాంటి త్యాగం అయినా చేయడానికి సిద్ధపడేవాళ్లే అసలు
సిసలైన కళాకారులు. అందంగా మాత్రమే కాదు.. కథ డిమాండ్ చేస్తే అందవిహీనంగా
కూడా కనిపించడానికి రెడీ అయిపోవాలి’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు చేసిన ‘మేరీ కామ్’
మరో ఎత్తు అవుతుంది. బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందిన
ఈ చిత్రం కోసం ప్రియాంక చాలా కష్టాలు పెడ్డారు. కండలు పెంచారు.. బాక్సింగ్
నేర్చుకున్నారు. ఇంకా ఎన్నో వ్యయప్రయాసలకోర్చారు. బుధవారం ‘మేరీ కామ్’
ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది సమయంలోనే ప్రియాంకకు
భారీ ఎత్తున ప్రశంసలు లభించాయి.

ఈ
చిత్రంలో నటించడంపట్ల తన ప్రియాంక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ
-‘‘క్లిష్టమైన పాత్రలు ఒప్పుకున్నప్పుడు నేను సవాలుగా తీసుకుంటా. ముఖ్యంగా
మేరీ కామ్ లాంటి పాత్రలు ఓ ఛాలెంజ్. నా నిజజీవితానికీ, ఈ పాత్రకూ దగ్గర
పోలికలుంటాయి. మాది చాలా చిన్న పట్టణం. అయినప్పటికీ అన్ని అడ్డు గోడలనూ
ధైర్యంగా తొలగించుకుని, ఈ స్థాయికి చేరుకున్నాను. జీవితంలో సక్సెస్ అయిన
ప్రతి ఒక్కరూ అన్ని ఎల్లలు దాటినవారే’’ అని చెప్పారు. ఈ చిత్రంలో ఓ
సన్నివేశంలో ఆమె గుండులో కనిపిస్తారు.
దీని గురించి చెబుతూ -‘‘ఈ సన్నివేశం గురించి దర్శకుడు చెప్పగానే,
కుదరదనలేదు. వెంటనే ఓకే అన్నాను. గుండుతో ఉన్నట్లుగా మేకప్ చేసుకుని
లొకేషన్లోకి ఎంటరయ్యా. ఓ పాత్ర ఒప్పుకున్న తర్వాత దాని కోసం నిజాయతీగా ఏం
చేయడానికైనా వెనకాడను’’ అని ప్రియాంక అన్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని మేరీ
కామ్ చూశారని, ఉద్వేగానికి గురై ఏడ్చేశారని ప్రియాంక తెలిపారు. ‘‘ఆమె కంట
తడిపెట్టుకోవడం చూసిన తర్వాత, ‘మేరీ కామ్’ జీవిత చరిత్రకు న్యాయం చేశామనే
నమ్మకం నూటికి నూరు పాళ్ళు కలిగింది’’ అని ప్రియాంక అన్నారు.
No comments:
Post a Comment