Friday, January 2, 2015

‘ఐ’ని సంక్రాంతికి ఎలా విడుదల చేస్తారు?

‘ఐ’ని సంక్రాంతికి ఎలా విడుదల చేస్తారు?- నట్టి కుమార్‌ 


సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలే విడుదల చేయాలనీ, డబ్బింగ్‌ సినిమాలను విడుదల చేయకూడదనీ రెండేళ్ల క్రితం ఫిల్మ్‌చాంబర్‌లో చేసిన తీర్మానానికి విరుద్ధంగా సంక్రాంతికి డబ్బింగ్‌ సినిమా ‘ఐ’ని విడుదల చేస్తున్నారనీ, చాంబర్‌ పెద్దలే ఈ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనీ విశాఖ టాకీస్‌ అధినేత నట్టి కుమార్‌ ఆరోపించారు. ‘ఐ’ స్థానంలో చిన్న సినిమాల విడుదలకు సహకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘తెలుగువాళ్లకు సంబంధించి సంక్రాంతి పెద్ద పండుగ. ఆ పండుగకు తెలుగు సినిమాలే విడుదలవడం ఎంతో కాలం నుంచీ ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా సంక్రాంతికి కనీసం రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. పెద్ద సినిమాలు లేకపోతే చిన్న సినిమాలు వస్తుంటాయి. ఆ విధంగా వచ్చే సంక్రాంతికి కూడా రెండు పెద్ద సినిమాలు - ‘గోపాల గోపాల’, ‘టెంపర్‌’ రిలీజవ్వాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ‘టెంపర్‌’ వెనక్కి వెళ్లింది. దాంతో ‘గోపాల గోపాల’ ఒక్కటే విడుదలవుతోంది. రెండో పెద్ద సినిమా లేదు కాబట్టి, చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలి. ‘గడ్డం గ్యాంగ్‌’, ‘పటాస్‌’, ‘బందిపోటు’ వంటివి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బింగ్‌ సినిమా రిలీజవడానికి లేదని రెండేళ్ల క్రితం చాంబర్‌లో నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. సంక్రాంతికి చిన్నవి కానీ, పెద్దవి కానీ మన తెలుగు సినిమాలే విడుదల కావాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌చాంబర్‌కూ, కాన్ఫెడరేషన్‌కూ కూడా పంపించారు. కానీ ఆ తీర్మానానికి విరుద్ధంగా ఇప్పుడు ‘ఐ’ సినిమాను విడుదల చేస్తున్నారు. శంకర్‌, రాజమౌళి గొప్ప డైరెక్టర్లు. వాళ్ల సినిమాలు ఎప్పుడొస్తే అప్పుడే ప్రేక్షకులకు పండుగ. అలాంటిది శంకర్‌ తీసిన ‘ఐ’ సినిమాను సంక్రాంతికి వేయడం కరెక్ట్‌ కాదు. ఎన్నో చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటికి అవకాశం ఇవ్వొచ్చు కదా. లేదా ‘గోపాల గోపాల’ ఒక్కటే రిలీజవనివ్వండి. దాంతో పాటు ఇప్పటికే థియేటర్లలో ఆడుతున్న ‘చిన్నదాన నీకోసం’, ‘ముకుంద’ సినిమాలకూ ప్రయోజనం కలుగుతుంది. చాంబర్‌లో పదవులన్నీ మీవే కాబట్టి, మీ ఇష్టం వచ్చినట్లు చేయడం కరెక్ట్‌ కాదు. మనం తీసుకున్న నిర్ణయాన్ని మనమే ఎలా ఉల్లంఘిస్తాం? మూడు వేల మంది ఉండే జనరల్‌ బాడీ సమావేశంలో ఈ విషయాన్ని పెట్టకుండా, ఏ హక్కుతో ‘ఐ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారో చెప్పాలి. ఆ సినిమాను చూసేందుకు ఎంతోమంది ఎదురుచూస్తున్న మాట నిజమే. కానీ దాన్ని తెలుగువారి పండుగకు వేయడం సరైంది కాదు. అందుకే సంక్రాంతికి దాన్ని విడుదల చేయొద్దని శంకర్‌ సహా అందరినీ రిక్వెస్ట్‌ చేస్తున్నాం. బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పడానికి చిన్న నిర్మాతలు భయపడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నన్ను ఇన్‌ఫార్మర్‌గా పెడితే, ఐదారుగురు సినిమా పెద్దల నుంచి రూ. 500 కోట్లు పన్ను కట్టిస్తాను. వాళ్లు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగ్గొడుతున్నారు. అలాగే 2006 నుంచి 2009 వరకు సర్వీస్‌ టాక్స్‌ని కట్టకుండా ఉండటానికి రాజమాణిక్యం అనే వ్యక్తి ద్వారా ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి డబ్బులు అందజేసిన విషయంపై చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలి. ఇందులో చాంబర్‌కు చెందిన అశోక్‌కుమార్‌ పాత్ర కూడా ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తు నడుస్తోంది.

No comments:

Post a Comment