మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
భారతీయ సినిమా ఇప్పటికి 101 ఏళ్ళు పూర్తి చేసుకొని, దిగ్విజయంగా ముందుకు
వెళుతోంది. మూగగా మొదలై మాటలు నేర్చిన సినిమా తెలుగు భాషలోనూ ఇప్పటికి 82
ఏళ్ళుగా సామాన్యుల్ని అలరిస్తూనే ఉంది. అయితే, వేషభాషలతో సహా మానవ
జీవితాన్నే ఎంతో మార్చేసిన ఈ శతాధిక వత్సర అద్భుతం తాలూకు చరిత్ర ఇప్పటికీ
సమగ్రంగా రికార్డు కాలేదనే చెప్పాలి. కొద్దిమంది ప్రయత్నాలు చేసినా, ఆర్థిక
వనరుల కొరత మొదలు అనేక ఇబ్బందులతో సంతృప్తికర ఫలితాలు తెరపైకి రానే లేదు. ఈ
నేపథ్యంలో మన తెలుగు హీరో - నిర్మాత మంచు విష్ణు తాజాగా ఓ ప్రయత్నం
చేస్తున్నారు. నూరు వసంతాల భారతీయ సినిమాపై ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను
తీయాలని భావిస్తున్నారు.